రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల నిబంధనలు, కొర్రీల పేరుతో హామీని ఎగవేసే ప్రయత్నాలు మొదలు పెట్టింది. రుణమాఫీకి రేషన్ కార్డు నిబంధనను తప్పనిసరి చేయబోతుంది. ఇదే జరిగితే ఎంతో మంది అర్హులైన రైతులు బ్యాంక్ లోన్లు మాఫీ అయ్యే అవకాశం ఉండదు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వచ్చే వాళ్లకే రుణమాఫీ చేస్తామని ఇప్పటికే చెప్పిన ప్రభుత్వం, కొత్తగా రేషన్ కార్డు నిబంధనను తెరపైకి తెచ్చింది. రాష్ట్రంలో పట్టాభూములు ఉన్న వేలాది మంది యువ రైతులకు రేషన్ కార్డులు లేవు. వాళ్లెవరూ ఇన్ కం ట్యాక్సులు కట్టేవాళ్లు కాదు.. వారిలో ఎక్కువ మంది తక్కువ భూములు ఉన్నోళ్లే.. అలాంటి వారికి కూడా రుణమాఫీ వర్తింపజేయకుంటే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందుతున్న వాళ్లనే రుణమాఫీకి అర్హులుగా పరిగణిస్తే 35 లక్షల మందికి పైగా రుణమాఫీ అవకాశాన్ని కోల్పోతారు. 2018లో రైతుబంధు అందిన అర్హుల జాబితాలోని చిన్న రైతులకే పీఎం కిసాన్ సాయం అందుతోంది. నిబంధనల పేరుతో వారిలోనూ కొందరికి పీఎం కిసాన్ సాయాన్ని కేంద్రం ఎగవేసింది. మార్టిగేజ్, గోల్డ్ లోన్ సహా అన్ని రకాల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలంటే రూ.45 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. అంత భారీ మొత్తం ఆగస్టు 15లోపు సమకూర్చడం సాధ్యం కాదు కాబట్టి కఠిన నిబంధనలతో స్కీం అమలు చేశామని చెప్పుకోవడంపై దృష్టి సారించారు. ఈక్రమంలోనే పీఎం కిసాన్, రేషన్ కార్డు నిబంధనలు తెరపైకి తెచ్చారు.
రుణమాఫీతో ప్రభుత్వంపై పడే భారాన్ని రూ.45 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లకు కుదించాలని, ఈ పరిమాణంలోనే రుణాలు మాఫీ చేసేలా అర్హుల సంఖ్య లెక్క తేల్చాలని ప్రభుత్వ పెద్దలు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టుగా సెక్రటేరియట్ లో చర్చ సాగుతోంది. రూ.25వేల కోట్లను దాటి ఒక్క పైసా కూడా రుణమాఫీ కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని సమాచారం. ఈక్రమంలోనే అర్హుల వడపోతకు కొర్రీలను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి ఎంత మందికైనా రూ.2 లక్షల వరకు ఉన్న అన్ని బ్యాంకు లోన్లను మాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా కింద ఎకరానికి రూ.15 వేల పెట్టుబడి సాయం, కూలీలకు రూ.12 వేల ఆర్థిక తోడ్పాటునందిస్తామని హామీ ఇచ్చారు. క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున భోనస్ ఇస్తామని కూడా గ్యారంటీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా రైతుభరోసా ఎవరికిస్తారనే దానిపై స్పష్టత లేదు. కౌలు రైతులు, కూలీలకు సాయం అందజేత దిశగా ఒక్క అడుగు ముందుకు పడలేదు. వడ్లకు భోనస్ అని హామీ ఇచ్చి.. ఇప్పుడు సన్నాలకు మాత్రమేనంటూ కండీషన్స్ అప్లయ్ అంటున్నారు. వీటికి తోడుగా డిసెంబర్ 9వ తేదీన్నే రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామన్నారు.
హరీశ్‌రావు రాష్ట్ర ఆర్థిక పరిమితులను చూసుకోకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి గద్దెనెక్కిన తర్వాత కానీ తత్వం బోధ పడలేదు. ఎన్నికల ప్రచార సభల్లో చెప్పిన దానికి భిన్నంగా రుణమాఫీపై పరిమితులకు సిద్ధమవుతున్నారు. రైతుభరోసా సాయం పంపిణీని ఐదు ఎకరాలకే పరిమితం చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే భరోసా కింద సాయం చేస్తామని చెప్తున్నారు. రైతు రుణాల మాఫీ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (కార్పొరేషన్) ఏర్పాటు చేసి ఓపెన్ మార్కెట్లో లోన్లు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రభుత్వ భూములను అమ్మి, అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాకుంటే వాటిని కుదబెట్టి నిధులు సమకూర్చుకోవాలని చూస్తున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోలు లాంటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ, ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి పనులకు లోన్లు తెస్తే తప్పుబట్టిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పుడు అదే లోన్లు, భూముల అమ్మకాలు, లీజులతో అప్పులు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ''రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేస్తామని చెప్పి కాళేశ్వరం కోసం కేసీఆర్ లోన్లు తెచ్చారు..'' అని అసెంబ్లీలో అప్పులను తప్పుబట్టిన రేవంత్ ఇప్పుడు తెచ్చే లోన్లను ఎలా ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు తిరిగి చెల్లిస్తారో చెప్పగలరా.. ? రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ దివాళా తీసిందంటూ అసెంబ్లీలో వైట్ పేపర్ పెట్టారు. దీంతో తెలంగాణ పరపతి దెబ్బతిన్నది. లోన్లు రావడానికి అనేక ఇబ్బందులున్నాయి. ఈ క్రమంలోనే విలువైన భూములను కుదబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నగదు సర్దుబాటు అయ్యే దారులు వెదుకుతూనే అర్హుల సంఖ్యను భారీగా కుదించి.. ఇదిగో రైతు రుణాలు మాఫీ చేశామని చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
Follow Telugu Scribe for latest news